వడ్దేపల్లిలో సంచలనం…
మునిసిపాలిటీపై ఎగిరిన ఫార్వర్డ్ బ్లాక్ జెండా!
8 వార్డుల్లో ఘన విజయం సాధించిన ఏఐఎఫ్బీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో స్థానానికి పరిమితం
కల్వకుంట్ల కవిత ప్రచారం హాట్‌టాపిక్
పెద్ద పార్టీలకు షాక్ ఇచ్చిన చిన్న పార్టీ
స్థానిక నాయకత్వం, వ్యూహం ఫలితం
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తున్న తీర్పు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో వడ్దేపల్లి మున్సిపాలిటీ సంచలన ఫలితాన్ని నమోదు చేసింది. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) అభ్యర్థులు ఎనిమిది వార్డుల్లో ఘన విజయం సాధించి మున్సిపాలిటీని పూర్తిగా కైవసం చేసుకున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్న పార్టీగా ఉన్న ఏఐఎఫ్బీ ఈ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏఐఎఫ్బీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐఎఫ్బీ అభ్యర్థుల విజయాన్ని రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాయి. ప్రధాన పార్టీలను పక్కనబెట్టి ప్రజలు ఫార్వర్డ్ బ్లాక్‌కు మద్దతు తెలపడం స్థానిక రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.
స్థానిక బలం… విజయానికి బాట
వడ్దేపల్లిలో ఏఐఎఫ్బీ అభ్యర్థులు స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రచారం నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ప్రధాన పార్టీలలో అంతర్గత విభేదాలు, అసంతృప్తి కూడా ఏఐఎఫ్‌బీకి అనుకూలంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొంతమంది స్థానిక నాయకులు ప్రధాన పార్టీలకు దూరమై ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేయడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గుర్తు కంటే వ్యక్తిగత ఇమేజ్, స్థానిక నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచినట్లు ఈ ఫలితం స్పష్టంచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా చర్చ..!
ఏఐఎఫ్బీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడంతో మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించింది. దీంతో చైర్మన్ పదవి సహా పాలనను స్వయంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీలు ప్రభావం చూపలేకపోవడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. మొత్తంగా వడ్దేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం చిన్న పార్టీలకూ ప్రజలు అవకాశం ఇస్తారనే సందేశాన్ని ఇచ్చింది. ఈ ఫలితం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమైంది.


