హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం
తప్పుడు పెట్టుబడులను ప్రొత్సహించిన అధికారులపై కొరడా
ముగ్గురు అధికారులపై వేటు వేసిన బ్యాంకు
దుబాయ్ కార్యకలాపాలపై నియంత్రణ సంస్థల కఠిన చర్యలు
కాకతీయ,బిజినెస్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో భారీ వివాదం చెలరేగింది. క్రెడిట్ సూయిస్ ఏటీ1 బాండ్ల విక్రయంలో అక్రమాలు, విదేశీ ఖాతాదారుల ఆన్ బోర్డింగ్‌లో లోపాల ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు సీనియర్ అధికారులను బ్యాంక్ తొలగించింది. ఈ పరిణామం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. తొలగించబడిన వారిలో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్, మధ్యప్రాచ్యం-ఆఫ్రికా విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ గుప్తా, మరో సీనియర్ అధికారి పాయల్ మంధ్యాన్ ఉన్నారు. ఈ వ్యవహారంపై గత ఏడాది నుంచే విచారణ కొనసాగుతోంది. కొంతమంది అధికారులు పెట్టుబడిదారులకు పూర్తి రిస్క్ వివరాలు వెల్లడించకుండా, క్రెడిట్ సూయిస్ కు చెందిన ప్రమాదకర ఏటీ1 బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బాండ్లు అధిక ప్రమాదం కలిగినవిగా భావించబడుతున్నాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాలను పక్కనబెట్టి, అధిక రిస్క్ ఉన్న ఉత్పత్తులను ప్రోత్సహించడం నియంత్రణ నిబంధనలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం బ్యాంక్ విశ్వసనీయతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
విదేశీ ఖాతాల మార్పిడి వివాదం
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం విదేశీ ఖాతాల నిర్వహణ.ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్లను బహ్రెయిన్‌కు మార్చి పెట్టుబడులు చేయించినట్లు విచారణలో తేలింది. ఖాతాదారుల అవగాహన లేకుండా ఈ మార్పులు జరిగాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌లోని డీఐఎఫ్‌సీ శాఖ ద్వారా ఖాతాదారులను ఆన్‌బోర్డ్ చేసి, తరువాత ఇతర దేశాల్లో ఖాతాలు తెరవడం వంటి విధానం నియంత్రణ సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఇది అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనలకు వ్యతిరేకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ కఠిన చర్యలు తీసుకుంది. డీఐఎఫ్‌సీ శాఖపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త వ్యాపారం చేయడం వంటి కార్యకలాపాలపై నిషేధం విధించింది. నమోదు కాని కస్టమర్లకు సేవలు అందించడం, పెట్టుబడి సలహాల్లో లోపాలు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


