రోడ్లపై ఫర్నిచర్ విక్రయిస్తే కేసులు తప్పవు
ట్రాఫిక్ సీఐ సుజాత హెచ్చరిక
కాకతీయ, ఖిలావరంగల్ : రహదారులపై ఫర్నిచర్ ఉంచి విక్రయాలు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ట్రాఫిక్ సీఐ సుజాత స్పష్టం చేశారు. ఖిలావరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో కొంతమంది వ్యాపారులు రోడ్డుపై పాత ఫర్నిచర్ ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ సీఐ సుజాత సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రహదారిపై కుర్చీలు, టేబుళ్లు, అల్మారాలు తదితర ఫర్నిచర్ ఉంచడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. ఇప్పటికే రద్దీగా ఉండే అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ఇలాంటి విక్రయాల కారణంగా ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ఆమె తెలిపారు.వ్యాపారం పేరుతో రహదారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సీఐ హెచ్చరించారు. వెంటనే రోడ్డుపై ఉంచిన ఫర్నిచర్‌ను తొలగించాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎవరైనా రహదారులపై వస్తువులు ఉంచి విక్రయాలు చేస్తే సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని ఆమె స్పష్టం చేశారు.


