కరాటేతో ఆత్మరక్షణ… విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది
వేములవాడలో 35వ వార్షికోత్సవంలో విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ: నేటి సమాజంలో ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమని విద్యార్థులు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరాటే కేవలం పోరాట విద్య మాత్రమే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఏకాగ్రతను పెంచి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. 35 సంవత్సరాలుగా అకాడమీ వేలాది మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. కరాటే సాధనతో చురుకుదనం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లలను మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నన్ ఆది శ్రీనివాస్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కరాటే సంఘ నాయకులు పాల్గొన్నారు.


