విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి
జాయింట్ కలెక్టర్ సాంధ్యారాణి
కాకతీయ, నల్ల బెల్లీ : నల్లబెల్లి మండలంలోని ఆర్.జి.జి.బి.వై పాఠశాలలో గురువారం స్పూర్తి (Life Skills) అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సాంధ్యారాణి, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శుభనివాస్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో విద్యార్థినులకు జీవన నైపుణ్యాల ప్రాముఖ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. జాయింట్ కలెక్టర్ సాంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థినులు తమ సామర్థ్యాలను నమ్ముకొని ముందుకు సాగాలని, సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించేందుకు కృషి చేయాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సమయ నిర్వహణ, నిర్ణయాలు తీసుకునే ధైర్యం వంటి లక్షణాలు జీవితంలో ఎంతో అవసరమని ఆమె వివరించారు.
అలాగే విద్యార్థినులు రాబోయే S.A–1 పరీక్షలకు సమగ్రంగా సిద్ధం కావాలని సూచించారు. ఆ తర్వాత ఆమె పాఠశాల తరగతి గదులు, స్టోర్‌రూమ్, డైనింగ్ హాల్, వాష్‌రూమ్, వంటగది మెనూను పరిశీలించారు. విద్యార్థుల వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.
ఎంపీడీవో శుభనివాస్ మాట్లాడుతూ లైఫ్ స్కిల్స్ అభ్యాసం ద్వారా విద్యార్థులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఎదగగలరని తెలిపారు. విద్యార్థినుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి జ్యోతి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


