కృత్రిమ అవయవాలతో దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం
దేవాదాయ–అటవీ–పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
సేవామార్గంలో ఆలయ ఫౌండేషన్ ముందడుగు
మహావీర్ వికలాంగుల సహాయ సమితి సహకారం
వరంగల్‌లో రెండు రోజుల శిబిరం ఏర్పాటు
కాకతీయ, వరంగల్ : దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ–అటవీ–పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఫంక్షన్ హాల్‌లో ఆలయ ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాళ్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. తక్కువ బరువు, నాణ్యతతో కూడిన కృత్రిమ అవయవాలు దివ్యాంగుల జీవనాన్ని సులభతరం చేస్తాయని అన్నారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి సేవలను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.
నాణ్యతతో పరికరాల అందజేత
ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే కృత్రిమ అవయవాలు కొన్నిసార్లు బరువుగా ఉండటంతో వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. మహావీర్ సమితి ద్వారా అందిస్తున్న పరికరాలు తక్కువ బరువుతో పాటు మెరుగైన పనితీరుతో ఉండటం అభినందనీయమన్నారు. దివ్యాంగులైనప్పటికీ అసాధ్యాలను సుసాధ్యం చేసిన వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ… నగరంలో రెండురోజుల పాటు శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించడం హర్షణీయమన్నారు. ఒక ఐఏఎస్ అధికారి తన స్వంత రాష్ట్రంలో ఇలాంటి సామాజిక సేవలు చేయడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ… మహావీర్ సమితి నిపుణులు మూడు రోజుల పాటు శిబిరంలోనే ఉండి కొలతలు తీసుకొని కృత్రిమ అవయవాలను అమర్చి వాటి పనితీరును పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరం ద్వారా సుమారు 150 మందికి కృత్రిమ అవయవాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


