జాతీయ హాకీ పోటీలకు ఎంపిక
ఢిల్లీలో జరిగే అఖిల పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం
హుజురాబాద్ క్రీడాకారులకు అభినందనలు
కాకతీయ, హుజురాబాద్ : ఢిల్లీలో ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత సివిల్ సర్వీసుల హాకీ పోటీలకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపిక కావడం ప్రాంతానికి గర్వకారణంగా మారింది. ముల్కనూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో శారీరక విద్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాదుల శ్యాంసుందర్ జట్టులో చోటు దక్కించుకోగా, సహకార శాఖలో సీనియర్ పరిశీలకుడిగా ములుగు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మాటూరి రాజేష్ కూడా ఎంపికయ్యారు.
మాటూరి రాజేష్ గతంలో బెంగళూరు, కురుక్షేత్ర, చండీగఢ్, రాయపూర్, రాంచి, భోపాల్, భువనేశ్వర్ నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో జట్టుకు నాయకత్వం వహించి విశేష ప్రతిభ కనబరిచారు. కాకినాడలో జరిగిన పోటీల్లోనూ రాణించి గుర్తింపు పొందారు. ఇద్దరి ఎంపికపై హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, కార్యదర్శి బొడిగె తిరుపతి, బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు. జిల్లా క్రీడారంగానికి ఇది మరో విజయంగా పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు సీనియర్, జూనియర్ హాకీ క్రీడాకారులు, కుటుంబ సభ్యులు, స్థానికులు శుభాకాంక్షలు తెలియజేశారు.


