కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని అజ్మీరా మానస రెజ్లింగ్ లో ప్రతిభ చూపింది. ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్ జియాగూడలో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలలో 55 కేజీల విభాగంలో మానస ప్రథమ స్థానం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ విజయంతో ఆమె వచ్చేనెల 1 నుంచి 5 వరకు హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలలో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థిని మానసను ఎస్ వో ఆవుల సునీత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కస్తూర్బా విద్యాలయం నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాల గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.


