సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి
ములుగు జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమం
కాకతీయ, ములుగు ప్రతినిధి : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా రవాణా శాఖ అధికారులు వాహనదారులు, ప్రయాణికుల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనాన్ని నడిపే డ్రైవర్ మాత్రమే కాకుండా వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని జిల్లా రవాణా అధికారి (డీటీవో) శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు సూచించారు. ఈ సందర్భంగా డీటీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనుకోకుండా ప్రమాదం సంభవించినప్పుడు సీట్‌బెల్ట్ ప్రాణాలను కాపాడే కవచంలా పనిచేస్తుందని తెలిపారు. వాహనం ఢీకొన్నప్పుడు లేదా అదుపు తప్పిన పరిస్థితుల్లో ప్రయాణికులు వాహనం వెలుపలికి ఎగిరిపడకుండా, తల స్టీరింగ్ లేదా డ్యాష్‌బోర్డ్‌కు తగిలి తీవ్ర గాయాలు కావడం నుంచి సీట్‌బెల్ట్ రక్షణ కల్పిస్తుందని వివరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని అధికారులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ, సీట్‌బెల్ట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని రవాణా శాఖ అధికారులు ప్రజలను కోరారు.


