కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి
మేయర్, వైస్‌మేయర్ పదవులు దళితులకు కేటాయించాలి
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీలకు రాజ్యాధికారం కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి సంతోష్ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల జనాభా సుమారు 20 శాతం ఉన్న నేపథ్యంలో, మేయర్, వైస్‌మేయర్ వంటి కీలక పదవులు ఎస్సీలకు దక్కేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. దళితుల సంక్షేమమే లక్ష్యమని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని మాతంగి సంతోష్ మాదిగ కోరారు. కార్పొరేషన్ పాలనలో దళితులకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌పీఎస్ యువసేన జిల్లా నాయకులు నల్లాల ఆనంద్ మాదిగ, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల కృష్ణ మాదిగ, నాయకులు బొల్లం యోగి, యుగంధర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


