కాకతీయ, గీసుకొండ : అధిక వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. మండలంలోని పోతరాజుపల్లి, మాచాపూర్, గీసుకొండ, గంగదేవిపల్లి గ్రామాల్లో పత్తి, వరి, సోయా, పసుపు, కూరగాయ పంటలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల బృందం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త డా. ఎ. విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నివారణ చర్యగా వేపనూనె (1500 పీపీఎం) లేదా అసిఫేట్ 300 గ్రాములు లేదా ఫ్లునికామైడ్ 50 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.
మొక్కజొన్నలో కత్తెర పురుగులు, ఆకుమాడు తెగుళ్లు కనిపిస్తున్నాయని, వీటి నివారణకు ఎమమెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు, ప్రాపికోనజోల్ 200 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారి చేయాల్సిందిగా సూచించారు. ఆలస్యంగా సాగు చేస్తున్న వరి పంటల్లో కలుపు సమస్య ఎక్కువగా తలెత్తుతుందని, గడ్డి జాతి కలుపు నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ 350 మి.లీ., వెడల్పాటి ఆకుల కలుపు నివారణకు ట్రైఫోమో ఈత్ఆక్సీసల్ఫురాన్ (కౌన్సిల్ ఆక్టివ్) 90 గ్రాములు ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు. పసుపు పంటలో అధిక వర్షాల వలన దుంప కుళ్ళు, దుంప పుచ్చు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన ఆయన, నివారణకు మెటల్ ఆక్సిల్ + మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
దుంప ఈగ నియంత్రణకు కార్బోఫ్యూరాన్ 3 సిజి గుళికలు ఎకరాకు 8–10 కిలోలు ఇసుకలో కలిపి పొలమంతా చల్లాలని, అలాగే పొటాష్ లోపాన్ని అధిగ మించేందుకు 13-0-45 ఎరువు 5 గ్రాములు లీటరుకు కలిపి ఆకులపై పిచికారి చేయాలని వివరించారు. మండల వ్యవసాయ అధికారి పి. హరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఆకుల ద్వారా ఎరువులు అందజేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే పంటలకు లాభం చేకూరుతుందని తెలిపారు. వరి పొలాల్లో కాలిబాటలు వేసుకోవడం ద్వారా గాలి వెలుతురు సులభంగా చేరి చీడపీడల బెడద తగ్గుతుందని, లింగాకర్షణ బుట్టలు, పసుపు కార్డులు వాడుతూ పురుగు ఉధృతి గమనించి అవసరమైనప్పుడు మాత్రమే స్ప్రే చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.రాజ్ కుమార్, డా.ఆర్.విశ్వతేజ, వ్యవసాయ విద్యార్థులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


