శాస్త్ర విజ్ఞానానికి వేదికగా సైన్స్ ఫేర్
సెయింట్ జాన్స్ స్కూల్‌లో వినూత్న నమూనాల ప్రదర్శన
చంద్రయాన్–3 ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణ
కాకతీయ, గీసుగొండ: మండలంలోని మరియాపురం సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫేర్–2026ను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 12, 13 తేదీలలో రెండు రోజులపాటు జరిగిన ఈ ఫేర్‌లో 380 మంది విద్యార్థులు పాల్గొని 250కు పైగా శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి, రోబోటిక్స్, అంతరిక్ష విజ్ఞానం, ఆరోగ్యం వంటి అంశాలపై రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. 10వ తరగతి విద్యార్థి జశ్వంత్ రూపొందించిన చంద్రయాన్–3 నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మండల విద్యాధికారి రవీందర్, సీఐ విశ్వేశ్వర జ్యోతి ప్రజ్వలన చేసి ఫేర్‌ను ప్రారంభించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం అవసరమని తెలిపారు. న్యాయనిర్ణేతలు ప్రాజెక్టులను పరిశీలించి విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమాన్ని కరస్పాండెంట్ ఫ్లేవియా డి సిల్వా, ప్రధానోపాధ్యాయురాలు సౌజన్య పర్యవేక్షించారు.


