సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం
కాకతీయ, హుజురాబాద్: పట్టణంలోని జ్యోతిబాపూలే కూడలిలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని హుజురాబాద్ పూలే కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే కమిటీ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పూలే కమిటీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటూ సమాజంలో స్త్రీ విద్యకు నాంది పలికిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. మహిళల విద్య, సాధికారత కోసం ఆమె చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. నేటి రోజుల్లో మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి పూలే కృషే ప్రధాన కారణమని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించి పూలే దంపతుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.
కార్యక్రమంలో హుజురాబాద్ మండలం ఉపసర్పంచుల ఫోరం కన్వీనర్ వన్నాల శివాజీ, పూలే కమిటీ గౌరవ అధ్యక్షుడు సందేల వెంకన్న, ఇప్పకాయల సాగర్, చిలుకమారి శ్రీనివాస్, చీకట్ల సమ్మయ్య, ముషం రాజేందర్, గోస్కుల మధుకర్, తిరునగరి రమేష్, దేవునూరి బాబు, దివిటి సురేష్ బాబు, పోగు సమ్మయ్య, మావునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి తదితరులు పాల్గొన్నారు


