అసమానతలపై సావిత్రిబాయి పూలే పోరాటం
దుగ్గొండిలో ఘనంగా 195వ జయంతి వేడుకలు
మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానం
విద్యతోనే సమాజ మార్పు సాధ్యం: సర్పంచులు
కాకతీయ, దుగ్గొండి : సమాజంలో అసమానతల నిర్మూలనకు, మహిళల హక్కుల సాధనకు జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మైసంపల్లి, మర్రిపల్లి గ్రామ సర్పంచులు వేముల ఇంద్రదేవ్, డ్యాగం సుజాత పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం దుగ్గొండి మండలంలోని మైసంపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. మహిళలు చదువుకోవడమే నేరంగా భావించిన రోజుల్లోనే విద్యను ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన గొప్ప విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అమ్మాయి–అబ్బాయి అనే తేడా లేకుండా అందరికీ విద్య అందినప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.
ఉపాధ్యాయుల సేవలకు గౌరవం
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దనసరి వెంకటలక్ష్మితో పాటు మహిళా ఉపాధ్యాయురాలను సర్పంచులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుల సేవలు సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొల్లంపల్లి ఆనందం, డ్యాగం శివాజీ, ఈద సురేందర్, ఇటుకల రవి, గాజు శివాజీ, కుక్కమూడి కవిత, రాణి నర్సింగం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


