సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం
ప్లాస్టిక్ నుంచి మేడారాన్ని రక్షిద్దాం
ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహణలో భాగస్వాములు కావాలి
22 భాషల బ్యానర్‌తో హన్మకొండలో విద్యార్థుల అవగాహన ర్యాలీ
కాకతీయ, హనుమకొండ : మేడారం మహాజాతర పవిత్రతను, అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట 22 భాషల భారీ క్లాత్ బ్యానర్‌తో వినూత్న అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి ముఖ్య అతిథిగా పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. మేడారం వంటి పవిత్ర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నియంత్రణ ప్రజల సహకారంతోనే సాధ్యమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో నినాదాలతో రూపొందించిన పర్యావరణ హిత క్లాత్ బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ‘ప్లాస్టిక్ రహిత మేడారం’ సందేశాన్ని ప్రజల్లో బలంగా నాటింది. ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడువాయి మండలంలో జరగనున్న *మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర*ను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సామాజికవేత్త, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.వి. శ్రీనివాస్ రావు, సంస్థ జాతీయ కార్యదర్శి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. భద్ర మాట్లాడుతూ, గత 14 ఏళ్లుగా మేడారంలో ప్లాస్టిక్ నియంత్రణపై నిరంతర కృషి చేస్తున్నామని, ఈసారి జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో 22 భాషల బ్యానర్ రూపొందించామని తెలిపారు. కాకతీయ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం నినాదాలతో ప్రాంతాన్ని మారుమోగించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పిట్టల వెంకన్న, సంస్థ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ పటేల్, జాతీయ యువజన కార్యదర్శి సుమెర్, జనగామ జిల్లా అధ్యక్షుడు నీలం యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.


