సోలార్‌తో ఆదాయం ఆదా
సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. సోలార్ ప్లాంట్లతో విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. టీజిరెడ్కో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఒక కిలోవాట్‌కు రూ.30 వేల రాయితీ లభిస్తుందని తెలిపారు. రెండు కిలోవాట్లకు రూ.60 వేల వరకు, మూడు కిలోవాట్లు పైగా రూ.78 వేల వరకు సబ్సిడీ ఉంటుందని వివరించారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చన్నారు. అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు ఇచ్చి ఆదాయం పొందవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రచార వాహనంతో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సమాఖ్యల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. జడ్పీ సీఈవో రాంరెడ్డి హాజరయ్యారు. టీజిరెడ్కో జిల్లా మేనేజర్ రాజేందర్, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ కుమార్ యాదవ్ మరియు అధికారులు పాల్గొన్నారు.


