సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్ మోసం
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర
వారి అకౌంట్లను అంతర్జాతీయ నేరాలకు వినియోగం
హెచ్‌డీఎఫ్ఎసీ, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో భారీగా లావాదేవీలు
ఆస్ట్రేలియా సైబర్ కేసులే ఆధారం… పోలీసుల లోతైన దర్యాప్తు
నిందితులను అరెస్టు చేసిన ఖమ్మం పోలీసులు
వివరాలు వెల్లడించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునిల్ దత్
కాకతీయ, వెబ్‌డెస్క్ : సత్తుపల్లి కేంద్రంగా పనిచేస్తూ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన ముఠా, ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసి వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించిన భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు గుర్తించిన లావాదేవీల విలువ ఏకంగా రూ.547 కోట్లుగా పోలీసులు నిర్ధారించారు. తేదీ 24-12-2025 ఉదయం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగ సాయికిరణ్ వీఎం బంజార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2022లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిందితులు పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, ఉడతనేని వికాస్ చౌదరి, మోరంపూడి చెన్నకేశవులు తనతో హెచ్‌డీఎఫ్‌సీ, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి, బ్యాంకింగ్ కిట్, ఏటీఎం కార్డులు, ఆన్‌లైన్ క్రెడెన్షియల్స్ తమ వద్దకు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ చివరి వారంలో ప్రవీణ్, చెన్నకేశవులు ఆస్ట్రేలియా పౌరులను సైబర్ మోసాలకు పాల్పడ్డ కేసులో అరెస్టు అయ్యారని తెలుసుకున్న బాధితుడు తన అకౌంట్లను పరిశీలించగా, కోట్ల రూపాయల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

బ్యాంక్ ఖాతాల నుంచి కోట్లల్లో లావాదేవీలు..
దర్యాప్తులో నిందితులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల బ్యాంక్ అకౌంట్లలో భారీగా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల ఖాతాల నుంచి మొత్తం రూ.547 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పోట్రు మనోజ్ కళ్యాణ్ – రూ.114.18 కోట్లు
మెడ భాను ప్రియ (భార్య) – రూ.45.62 కోట్లు
మెడ సతీష్ (బావ) – రూ.135.48 కోట్లు
బొమ్మిడాల నాగలక్ష్మి – రూ.81.72 కోట్లు
నరసింహ కిరాణా & డైరీ, కరీంనగర్ (మ్యూల్ అకౌంట్) – రూ.92.54 కోట్లు
ఉడతనేని వికాస్ చౌదరి – రూ.80.41 కోట్లు
ఉద్యోగాల పేరిట అకౌంట్ మాఫియా
నిందితులు సత్తుపల్లి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులను ఉద్యోగాల పేరుతో పిలిపించి, వారి పేర్లపై సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు తెరిపించి, వాటిని సైబర్ నేరాలకు వినియోగించినట్టు విచారణలో తేలింది. కొందరికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించి అకౌంట్లు తెరవించారని పోలీసులు వెల్లడించారు. లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తిరుమల సాయి, సత్తుపల్లికి చెందిన బాడిస మురళి తదితరులు ఏజెంట్లుగా పనిచేస్తూ రైతులు, నిరుద్యోగులను గుర్తించి అకౌంట్లు తెరవించారని తేలింది. ఈ అకౌంట్లను సైబర్ మోసాల డబ్బు చలామణీకి వాడినట్టు నిర్ధారణ అయింది.
అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్
నిందితులు విదేశాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి పెట్టుబడులు, మ్యాట్రిమోనీ, క్రిప్టో ట్రేడింగ్, బెట్టింగ్, గేమింగ్ పేర్లతో ప్రజలను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి ఫేక్ లింకుల ద్వారా ఖాతాలు ఖాళీ చేసినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును డాలర్లు, క్రిప్టో కరెన్సీగా మార్చినట్టు దర్యాప్తులో తేలింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, ఈ అకౌంట్లపై దేశవ్యాప్తంగా వందల సైబర్ ఫిర్యాదులు నమోదై ఉన్నట్టు తేలింది. ఇప్పటికే పోట్రు ప్రవీణ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితులు, మ్యూల్ అకౌంట్లపై చర్యలు కొనసాగుతున్నాయని, సైబర్ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేస్తామని స్పష్టం చేశారు.


