కాకతీయ, పెద్దపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అమర్ నగర్ చౌరస్తా వద్ద గల సర్వేపల్లి విగ్రహానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్‌లో పెద్దపల్లి రెసిడెన్షియల్ టీచర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎమ్మెల్యే విజయరమణ రావును సన్మానించారు. కార్యక్రమంలో పెద్దపల్లి రెసిడెన్షియల్ టీచర్స్ సంఘం సభ్యులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


