సర్పంచ్ ఆమె.. శిక్షణ ఆయనకు..!
మహిళలకు ఏర్పాటు చేసిన తరగతుల్లో భర్తల హాజరు
గంగాదేవిపల్లిలో జరుగుతున్న ఐదు రోజుల శిక్షణలో విచిత్రం
పంచాయతీ పాలనలో కుటుంబ జోక్యం
అధికారుల సమక్షంలోనే నిబంధనల ఉల్లంఘనపై చర్చ
మహిళా ప్రజాప్రతినిధుల సాధికారత లక్ష్యానికి దెబ్బ
చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
కాకతీయ, దుగ్గొండి : మహిళా సర్పంచ్‌లు స్వతంత్రంగా గ్రామ పాలన నిర్వహించి నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుండగా, ఆ తరగతులకు మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు హాజరవుతున్న ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మహిళా ప్రజాప్రతినిధులు స్వయంగా పంచాయతీ చట్టాలు, పరిపాలనా విధానాలు నేర్చుకుని గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ సత్య శారదా ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ శిక్షణా కార్యక్రమం ఉద్దేశానికి విరుద్ధంగా మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు హాజరవడం విస్మయానికి గురిచేస్తోంది. మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, గ్రామ ఫస్ట్ సిటిజన్‌గా గౌరవం పొందాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఇతరుల జోక్యం వల్ల మహిళలు పరిపాలనలో చురుకుదనం కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

శిక్షణలో భర్తల హాజరుపై సందేహాలు
వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి గ్రామంలో జిల్లాలోని మూడు మండలాలకు చెందిన సర్పంచ్‌లకు మూడవ విడత శిక్షణ కొనసాగుతోంది. ఈ శిక్షణలో భాగంగా తాగునీటి నిర్వహణ, పారిశుద్ధ్యం, గ్రామ రహదారులు, విద్య, వైద్యం, హాస్టళ్లు, కస్తూర్బా, రెసిడెన్షియల్ పాఠశాలల పరిశీలన, ప్రభుత్వ భూముల సంరక్షణ, గ్రామాభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఒక మండలానికి చెందిన మహిళా సర్పంచ్‌లకు బదులుగా వారి భర్తలు గత రెండు రోజులుగా ఈ శిక్షణా తరగతులకు హాజరవుతున్నట్లు వెల్లడైంది. ఇది అధికారులకు తెలిసే జరుగుతోందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే మండలానికి చెందిన అధికారులు శిక్షణ ఇస్తుండగా కూడా మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు పాల్గొనడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మహిళా సాధికారతపై ప్రభావం
ప్రభుత్వం మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ పంచాయతీ రిజర్వేషన్లు అమలు చేసి, గ్రామ పాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రయత్నిస్తోంది. అయితే అధికారిక శిక్షణా కార్యక్రమాల్లోనే మహిళల స్థానంలో కుటుంబ సభ్యులు పాల్గొనడం మహిళా సాధికారత లక్ష్యానికి విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ఇలా జరిగితే గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం ఎంత మేర ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మహిళా సర్పంచ్‌లే స్వయంగా శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని, మహిళా ప్రజాప్రతినిధుల పరిపాలనా స్వాతంత్ర్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


