కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్
కాకతీయ, కారేపల్లి: కరువు కాటుతో పంటలు దెబ్బతిని, చేతిలో పనిలేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పథకం ఆశాకిరణంగా మారింది. సింగరేణి మండలం పరిధిలోని దుబ్బ తండా గ్రామపంచాయతీలో సోమవారం ఉపాధి పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. స్థానిక సర్పంచ్ ఆంగోత్ మత్రు స్వయంగా పార పట్టి మట్టి తీస్తూ పనులను ప్రారంభించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అదును తప్పిన వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో పత్తి, మిర్చి పంటలు నష్టపోయాయి. ఈ కరువు కాలంలో ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో అర్హులైన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం” అని తెలిపారు. చెరువుల పూడికతీత, కాలువల నిర్మాణం, గ్రామ అంతర్గత రహదారుల మరమ్మత్తులు, పెద్దఎత్తున మొక్కల నాటకం వంటి పనులతో గ్రామ వికాసానికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు, తాగునీరు, ఒఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కూలీల వేతనాలు ఆలస్యం కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారదర్శకతే పరమావధిగా పనులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.


