నిరుపేద కుటుంబానికి సర్పంచ్ భరోసా
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన కలకోట సుగుణ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నాగారం సర్పంచ్ కటకం మమత ప్రదీప్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామ పాలన పరంగా తాను ఎల్లవేళలా తోడుగా ఉంటానని భరోసా కల్పిస్తూ తన వంతు సహాయంగా ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మమత ప్రదీప్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉండటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. అనారోగ్యం, మృతి వంటి అనివార్య పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరుతూ, పేదల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. సర్పంచ్ చూపిన మానవీయతను గ్రామస్తులు అభినందిస్తూ, ఇలాంటి సేవా దృక్పథం ప్రజాపాలనకు ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


