వర్ధన్నపేట మునిసిపల్ చైర్మన్గా సారంగపాణి
కాంగ్రెస్ ఖాతాలో మున్సిపల్ పీఠం
రాజకీయ ఉత్కంఠకు తెర
చైర్మన్గా పాలకుర్తి సారంగపాణి ఏకగ్రీవ ఎన్నిక
వైస్ చైర్మన్గా స్వతంత్ర అభ్యర్థి నేతవత్ షీబారాణి
ప్రత్యేక సమావేశంలో అధికారికంగా ప్రకటించిన ఎన్నికల అధికారులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్గా స్వతంత్ర అభ్యర్థి నేతవత్ శీబా రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారులు ఈ నియామకాలను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున పాలకుర్తి సారంగపాణి పేరును కౌన్సిలర్లు ప్రతిపాదించగా, మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన చైర్మన్గా ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి నేతవత్ శీబా రాణికి వైస్ చైర్మన్ పదవి దక్కింది.
అభివృద్ధే లక్ష్యం : సారంగపాణి
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ పాలకుర్తి సారంగపాణి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ నేతవత్ శీబా రాణి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అందరితో సమన్వయంతో పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకోవడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ప్రారంభమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



