పీడిత వర్గాల సమానత్వానికి సంత్ సేవాలాల్ స్ఫూర్తి
287వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన మంత్రి
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ
కాకతీయ, వరంగల్ : పీడిత వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ 19వ డివిజన్ కాశీబుగ్గలో నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అధికారిక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి ఆధ్యాత్మిక గురువే కాకుండా సామాజిక చైతన్యాన్ని కలిగించిన గొప్ప సంస్కర్త అని అన్నారు. మహిళలకు సమాన గౌరవం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన చేసిన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
బంజారాల అభివృద్ధికి ప్రభుత్వ కట్టుబాటు
బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నగరంలో సేవాలాల్ ఆలయం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, అధికారులు, బంజారా ప్రతినిధులు పాల్గొన్నారు.


