ఎంజీఎం హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు
కాకతీయ, గణపురం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్‌లో శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రంగవల్లి, పతంగి పోటీలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించింది. విద్యార్థులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించగా, హరిదాసుల సందడి, భోగిమంటలు, గాలిపటాల ఎగురవేతతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ, సంక్రాంతి తెలుగువారి ఆచార–సంప్రదాయాలకు ప్రతీక అని, విద్యార్థుల్లో సంస్కృతి విలువలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్, ప్రిన్సిపల్ మధుకర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


