కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీలో వేతనాలు అందక, అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సఫాయి కార్మికుడు మైదం మహేష్ మరణంపై బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని విమర్శించారు. మున్సిపాలిటీలో ఐదు నెలలుగా వేతనాలు అందక, మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయిన మహేష్ కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. సోమవారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు.
ఏరియా హాస్పిటల్ నుండి బస్టాండ్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో బడే నాగజ్యోతి కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుని ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని, దీనికి మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. మహేష్ మరణంపై ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఒక ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గుచేటు అని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తాన్ని మహేష్ కుటుంబానికి అందజేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ చెన్న విజయ్, వేములపల్లి భిక్షపతి, పోరిక విజయ్ రామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


