పారిశుధ్య పనులు పక్కాగా పూర్తి చేయించాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంతోపాటు జాతర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పక్కాగా పూర్తి చేయించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడలోని శివార్చన స్టేజీ, ఇతర పరిసర ప్రాంతాల్లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారం నిలువ ఉండకుండా.. ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు.చెత్త తరలించే ట్రాక్టర్, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, నీటిని సరఫరా చేయాలని సూచించారు.
కమాండ్ కంట్రోల్ రూంలో పరిశీలన
భీమేశ్వర సదన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. శ్రీ భీమేశ్వరస్వామి, బద్ది పోచమ్మ, ప్రసాదం కౌంటర్లు ఇతర ప్రదేశాల్లో భక్తుల రద్దీని పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.పరిశీలనలో డీఆర్డీఓ గీత, మిషన్ భగీరథ ఈఈ అన్వర్, తహసీల్దార్ జయంత్ కుమార్, ఎల్డీఎం మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.


