కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారులో మియాపూర్ లోని రఫా పునరావాస కేంద్రంలో మాద్రక ద్రవ్యాల వ్యసనంపై చికిత్స పొందుతున్న 39 ఏళ్ల సందీప్‌ను నిన్న రాత్రి దారుణంగా హత్య చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్ ఆగస్ట్ నుండి ఎనిమిది నెలలుగా కేంద్రంలో మాదకద్రవ్య డీ-అడిక్షన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
నల్గొండ జిల్లా నుంచి వచ్చిన ఆదిల్, బార్సాస్‌కు చెందిన సులేమాన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా చికిత్స పొందుతూ సందీప్‌తో వ్యక్తిగత విభేదాల కారణంగా బుధవారం రాత్రి ఘర్షణకు కారణమయ్యారు. ఈ ఘర్షణలో ఇద్దరు నిందితులు కలిసి సందీప్‌పై దాడి చేసి అతన్ని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనను మియాపూర్ పోలీసులు గమనించి, తక్షణమే కేసు నమోదు చేశారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువరించబడలేదు. పోలీసులు విచారణ కొనసాగిస్తూ, హత్య వెనుక అసలు కారణాలను, మరిన్ని వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.


