నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా..
పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు..
8 మంది అరెస్ట్.. పరారీలో మరొకరు
కాకతీయ, అశ్వాపురం : నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న జగ్గారం క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఇసుక లారీని పట్టుకున్నారు. డ్రైవర్ నాతి రాములు వే బిల్లును చూపించగా అనుమానం వచ్చి ప్రశ్నించారు. దీంతో నకిలీ వే బిల్ అని, ఓనర్ హైదరాబాద్ కు చెందిన కర్నాటి శివశంకర్ ఇచ్చి పంపాడని తెలిపాడు. అలాగే రామానుజవరం ర్యాంపులో ఒక వ్యక్తి తనకు డీడీ లేకుండా ఇసుక లోడ్ చేశాడని తెలిపాడు. దీంతో లారీని సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరు కలిసి దందా..
రామానుజవరం ఇసుక ర్యాంపు నందు తనిఖీ చేయగా అక్కడ పనిచేసే టీజీఎండిసికి సంబంధించిన ముగ్గురు ఉద్యోగులు దగ్గు నిఖిల్ దీప్, నాగేల్లి మధు, బుల్లెద్దు అనిల్ డీడీ లేకుండా ఇసుకను లారీలో లోడ్ చేశారని, జెసిబి డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ ఇసుకను లోడ్ చేశాడని, అతనికి లోడ్ చేయమని ర్యాంపులో సూపర్వైజర్ గా పని చేసే సతీష్ రెడ్డి చెప్పాడని తెలిసింది. అలాగే కర్నాటి శివశంకర్ గురించి తెలుసుకొని హైదరాబాద్ హయత్ నగర్ లోని అతని ఇంటి వద్దకు వెళ్లగా నేరం ఒప్పుకొని వే బిల్లులు తానే తయారు చేసే వాడినని అంగీకరించారు. ఇందుకోసం ఉపయోగించే లాప్‌టాప్, ప్రింటర్ అలాగే రామానుజవరం సంబంధించిన స్టాంపును స్వాధీనం చేసుకున్నారు. శివశంకర్ తనకు వే బిల్లు తయారు చేయడంలో తన ఊరు సంస్థాన్ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన కిరణ్ నికిలీ వే బిల్లులు తయారు చేయడం నేర్పించాడని తెలిపారు. అంతకుముందు కిరణ్ పై 2023వ సంవత్సరంలో నకిలీ వే బిల్లుల తయారు చేసినందుకు వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయి జైలుకు కూడా వెళ్లాడని తెలిపాడు. తాను కిరణ్ కలిసి పలు రీచ్లకు సంబంధించిన నకిలీ వే బిల్లులు తయారు చేసి పలుమార్లు ఇసుక అక్రమ రవాణా చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
అరెస్టైన వారి వివరాలు..
నకిలీ వే బిల్లుల తయారీ కేసులో కర్నాటి శివ శంకర్, నాతి రాములు, ఇరగదిల్ల ఉపేందర్, దగ్గు నిఖిల్ దీప్, నాగేల్లి మధును పోలీసులు అరెస్టు చేశారు. కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన బోల్లేదు అనిల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసులో A-2గా E.కిరణ్ (వే బిల్లు తయారు చేసిన వ్యక్తి), A-3గా సతీష్ రెడ్డి ( రామానుజవరం ఇసుక ర్యాంపు), A-9గా సుర్వే శ్రీకాంత్ ( లారీ ఓనర్) ఉన్నారు. ఎవరైనా నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేసినా, చేయాలని చూసినా వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.


