ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి
ఆకేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు
అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆగ్రహం
అభివృద్ధి–సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమంటూ స్పష్టం
కాకతీయ, నర్సింహులపేట : అధికారులు ఇసుక దోపిడీని వెంటనే అరికట్టాలని డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆదేశించారు. మండల కేంద్రంలో శనివారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆకేరు పరివాహక ప్రాంతాలైన జయపురం, కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం గ్రామాల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ ఇసుక రవాణా, దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ విధుల్లో మార్పు చూపాలని హెచ్చరించారు.
సంక్షేమం–అభివృద్ధే ధ్యేయం
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తోందని రామచంద్రనాయక్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. అయితే కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో రాధిక, ఏఈ సుగుణాకర్, ఎస్సై సురేష్, జీపీఓలు రాధిక, యాకూబ్ పాషా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా నాయకుడు బొబ్బ సోమిరెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు దస్రునాయక్, సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్, స్థానిక సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉపసర్పంచ్ కాస యాకయ్యతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


