చెక్‌డ్యామ్‌ల పరిధిలో ఇసుక తవ్వకాలకు నిషేధం
జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ స్పష్టం
కాకతీయ, కరీంనగర్ : జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నదులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల వద్ద భద్రతా దృష్ట్యా డ్యామ్‌కు ఎగువన, దిగువన 300 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఈ నిబంధనల అమలును అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని నదీ ప్రవాహాలకు సంబంధించి సరిహద్దులను స్పష్టంగా గుర్తించి రికార్డు చేయాలని సూచించారు.
ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, టీజీఎండీసీ, పోలీస్ శాఖలు సమన్వయంతో ఇసుక రీచ్‌లను తరచుగా తనిఖీ చేయాలని చెప్పారు. ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కేటాయింపులో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచనలు చేశారు.
సమావేశంలో గ్రౌండ్ వాటర్ డీడీ శ్యాంప్రసాద్ నాయక్, డీపీఓ జగదీశ్వర్, జిల్లా జియాలజిస్ట్ ప్రసన్న, డీఈఈ రాజేందర్, డిప్యూటీ డీఈ వేణుగోపాల్, మైన్స్ ఏడీ రాఘవరెడ్డి, టీజీఎండీసీ పీడీ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ రవి, ఆర్ఓ కనుక జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


