పంథా మార్చిన ఇసుక మాఫియా
సంచుల్లో నింపి రవాణా.. పోలీసుల నిఘాకు చిక్కిన ముఠా
మూడు ట్రాక్టర్లు, మూడు బొలెరోలు సీజ్
తొమ్మిది మంది అరెస్ట్.. సుల్తానాబాద్ మండలంలో ఘటన
కాకతీయ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ పోలీసుల కట్టుదిట్టమైన నిఘాతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ముఠా గుట్టు బయటపడింది. సోమవారం గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు బొలెరో వాహనాలను పోలీసులు సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఇసుక మాఫియా కొత్త పంథాను ఎంచుకుని సంచుల్లో నింపి రవాణా చేస్తుండటం కలకలం రేపింది. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్, రాజ్ మహ్మద్, షేక్ సల్మాన్, షేర్ అలీ, షేక్ చాంద్ మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను దొంగలించి, సన్నగా చెరిగి అనుమానం రాకుండా సంచుల్లో నింపి బొలెరో వాహనాల్లో తరలిస్తూ ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు వెళ్తుండగా చెర్లబుత్కూర్ గ్రామం వద్ద రూరల్ పోలీసులు పట్టుకున్నారు.
ట్రాక్టర్లతో అక్రమ రవాణా.. రైల్వే గేట్, స్టేజీ వద్ద అరెస్టులు
నగునూరు గ్రామానికి చెందిన కుంచం రఘు, కిసాన్‌నగర్‌కు చెందిన పండుగ అనిల్ అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. అలాగే బొమ్మకల్ గ్రామానికి చెందిన కాశీపాక మహేష్, కాశీపాక శివకుమార్ ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా బొమ్మకల్ గుంటూరుపల్లి స్టేజీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మూడు బొలెరో వాహనాలు, మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు. అలాగే తొమ్మిది మంది నిందితులను కరీంనగర్ రూరల్ ఎమ్మార్వో ముందు హాజరుపరచి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పూచీకత్తుపై బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడేవారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఇలాంటి చర్యలు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


