ఇసుక లోడింగ్ బంద్
ములుగు జిల్లాలో కాంట్రాక్టర్ల సిండికేట్
ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపణలు
ఆ మొత్తం లారీ యజమానుల నుంచి వసూలు
రూ.3500వేలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం
భద్రాచలం, భూపాలపల్లి, ములుగు జిల్లా కాంట్రాక్టర్ల వైఖరి
టీజీఎండీసీ అధికారులూ వత్తాసు పలుకుతున్నారంటూ మండిపాటు
టీజీఎండీసీ కార్యాలయంలో రహస్యంగా కాంట్రాక్టర్లతో లారీ యజమానుల భేటీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా సహా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక లోడింగ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి అని, ప్రభుత్వ బిల్లులు నాలుగు నెలలుగా విడుదల కాలేదనే సాకుతో కాంట్రాక్టర్లు ప్రతి లారీపై అదనంగా లోడింగ్ చార్జీలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తామంటూ బుధవారం ఉదయం నుండే ఇసుక లోడింగ్ నిలిపివేసినట్టు సమాచారం. ములుగులో 3,500,భూపాలపల్లిలో 2,500,భద్రాద్రిలో 2,000 ఇవ్వకపోతే లోడింగ్ జరగదని నిరుపేసినట్టు సమాచారం.
జిల్లాలవారీగా కాంట్రాక్టర్ల డిమాండ్లు ఇలా
ములుగు 3,500, భూపాలపల్లి 2,500, భద్రాద్రి 2,000 చొప్పున అదనపు లోడింగ్ చార్జీ చెల్లించాలని కాంట్రాక్టర్లు హుకుం జారీ చేస్తుండటం గమనార్హం. ఇందుకు టీజీఎండీసీ అధికారులు కూడా వారికి మద్దతు తెలుపుతున్నట్లుగా లారీ అసోసియేషన్ నాయకులు వెల్లడిస్తుండటం గమనార్హం. వాస్తవానికి సర్కారు నిర్ణయించిన 14,800 ఇసుక డీడీలోనే లోడింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు దీనిని పూర్తిగా పక్కన పెట్టి లారీ యజమానుల వద్ద నుంచి మళ్లీ డబ్బు వసూలు చేస్తుండటం గమనార్హం.
డీడీ కి అదనంగా ఇవ్వాలి..
ప్రతి లారీకి ప్రభుత్వం స్థిరపరిచిన 14,800 డీడీతోపాటు లోడింగ్ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండగా మాలోడింగ్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి అనే కారణాలు చెబుతూ కాంట్రాక్టర్లు లారీ యజమానుల వద్ద నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే లోడింగ్ డబ్బులు కూడా తీసుకొని లారీ యజమానుల నుంచి కూడా లోడింగ్ చార్జీలను వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీజీఎండీసీ ఆధ్వర్యంలో జరిగిన రహస్య సమావేశం!
భద్రాచలం, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇసుక కాంట్రాక్టర్లు మరియు లారీ ఓనర్లతో రాష్ట్ర టీజీ ఎండీసీ అధికారుల సూచనల మేరకు మంగళవారం సమావేశం కూడా నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు లోడింగ్‌కు చార్జీలు విధించాలని డిమాండ్‌ను వినిపించారు. ప్రతి లారీపై రూ. 2వేల నుంచి 3500వరకు ఆయా ఏరియాల వారీగా అడుగుతుండటం గమనార్హం.ఈ డబ్బు చెల్లించకపోతే లోడింగ్ నిలిపివేయాలని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే బుధవారం లోడింగ్ నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. సర్కారు చెల్లించాల్సిన డబ్బు ను లారీ యజమానులపై కాంట్రాక్టర్లు మోపుతున్నారని లారీ అసోసియేషన్లు మండిపడుతున్నాయి. ఇసుక ధర 14,800 ఉండగా ఇందులోనే లోడింగ్ చార్జీలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది అని, కాంట్రాక్టర్లు లారీ యజమానుల వద్ద నుండి ఏ విధమైన అదనపు లోడింగ్ చార్జీలు వసూలు చేయరాదు అనే నియమమున ఈ నిబంధనలను పట్టించుకోకుండా అదనపు వసూళ్లు చేయడం వల్ల లారీ యాజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక లోడింగ్ బంద్…..
ములుగు జిల్లాలోని ఇసుక క్వారీలలో బుధవారం ఉదయం నుంచి లోడింగ్ నిలిచిపోయాయని, క్వారీ యాజమానులు లోడింగ్ చార్జీలు నిర్ణయించిన మేరకు చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తామంటూ కాంట్రాక్టర్లు భీష్మించుకు కూర్చున్నారని, లోడింగ్ కోసం వెళ్లిన లారీలు భారీ నిలిచిపోవడంతో చేసేదేమీ లేక కాంట్రాక్టర్కు లోడింగ్ చార్జీలు ఇచ్చి ఇసుకను లోడ్ చేసుకుంటున్నామని లారీల యాజమాన్లు వాపోతున్నారు.


