ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్
కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా కొత్త విధానం
‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా నేరుగా బుకింగ్
మధ్యవర్తులకు చోటు లేదు.. అక్రమాలకు చెక్!
అక్రమ రవాణాపై కఠిన నియంత్రణ
ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక వెసులుబాటు
16 జిల్లాలకు విస్తరణ లక్ష్యం
టీజీఎండీసీ వైస్‌చైర్మన్ భవేశ్ మిశ్రా
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఎండీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, గనులు–భూగర్భశాస్త్ర శాఖ డైరెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ ఆన్‌లైన్ ఇసుక విధానాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అమలు చేయనున్న నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా బుకింగ్
ఇసుక బుకింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ అనే మొబైల్ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు భవేశ్ మిశ్రా వివరించారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కలుగుతుందని, మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. ఇసుక సరఫరా వ్యవస్థ మరింత సులభంగా, సమర్థంగా మారుతుందన్నారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక రవాణా జరగాలని, మాన్యువల్ రసీదులు జారీ చేయరాదని స్పష్టం చేశారు. ఈ విధానం అమలులోకి వస్తే నిర్మాణ రంగంలో ఇసుక కొరత తీరడమే కాకుండా, అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను సమర్థంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక అవకాశం
ఇందిరమ్మ గృహ నిర్మాణాల కోసం ఈ యాప్‌లో ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు భవేశ్ మిశ్రా తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీనివల్ల పేదల గృహ నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో విధానం విజయవంతమైతే, ఇసుక నిల్వలు ఉన్న రాష్ట్రంలోని సుమారు 16 జిల్లాలకు ఈ ఆన్‌లైన్ విధానాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఇసుక అవసరం ఉన్నవారు ‘మన ఇసుక వాహనం’ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్‌ఫోన్ లేని వారు గ్రామపంచాయతీ కార్యదర్శులను సంప్రదించి బుకింగ్ చేయించుకోవచ్చని తెలిపారు. కరీంనగర్ జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన నేపథ్యంలో అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ విధానాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తహసీల్దార్లు పకడ్బందీగా విధులు నిర్వహించాలని, ఆర్డీవోలు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
15 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి
రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రవాణా శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో కొత్త ఇసుక విధానానికి అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కొత్త పాలసీ అమలుకు అవసరమైన ఏర్పాట్లు 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులతో నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, గనుల శాఖ ఉప డైరెక్టర్ జయరాజ్, ప్రాజెక్టు మేనేజర్ రాధాకృష్ణ, తహసీల్దార్లు, గనులు, గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.


