కాకతీయ, నేషనల్ డెస్క్: పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఈమధ్యే తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నిక అయ్యారు. ఈ క్రమంలో తదుపరి ప్రధానిగా తకైచి బాధ్యతలు తీసుకునేందుకు మార్గం సుగుమం అయ్యింది. దీంతో జపాన్ కు తొలి మహిళా ప్రధానిగా తకైచి ఈ అరుదైన ఘనత సాధించనున్నారు.
ఈమధ్యే దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభో కూడా మెజార్టీ కోల్పోవల్సి వచ్చింది. దీంతో ఇషిబా పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి తకైచి విజయాన్ని సాధించింది.
దేశ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు జపాన్ పార్లమెంట్ అక్టోబర్ 15న ఓటింగ్ నిర్వహించనున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. తాజాగా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమిని ఆమె ఓడించారు. 64ఏళ్ల తకైచి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంట్ కు ఎన్నిక అయ్యారు. ఎల్ డీపీలో ఆర్ధిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లోనూ పనిచేశారు. ఈ గెలుపు తనకు సంతోషం ఇవ్వడం కంటేనూ..బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా తకైచి పార్టీ సభ్యులతో చెప్పుకొచ్చారు.


