మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం..
టాక్ ఆఫ్ ది టౌన్‌గా కుమారుడి పెళ్లి!
సామూహిక వివాహ వేడుకలో తాళి కట్టిన మధ్యప్రదేశ్ సీఎం కొడుకు
రాందేవ్ బాబా వేదమంత్రాల సాక్షిగా జరిగిన పవిత్ర వివాహం
మోహన్ యాదవ్ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
కాకతీయ, నేషనల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మరోసారి తన వినమ్రత, విలువలను దేశానికి చాటి చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జంబో లగ్జరీ వెడ్డింగ్‌లు చేసుకునే ఈ యుగంలో.. సీఎం మాత్రం పూర్తి భిన్న దారి పట్టారు. ఆడంబరానికి పూర్తిగా నో చెప్పి, తన కుమారుడి వివాహాన్ని నిరాడంబరంగా, సామాజిక సమానత్వానికి నిదర్శనంగా నిర్వహించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడి పెళ్లంటే.. భారీ వేదికలు, ప్రత్యేక అలంకరణలు, సెలబ్రిటీ అతిథులు, వేలాది మంది సిబ్బంది అన్నీ కలసి కోట్ల బడ్జెట్‌తో జరిగే వేడుక. కానీ మోహన్ యాదవ్ మాత్రం ఈ లగ్జరీ రూట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉజ్జయినిలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో మరో 21 జంటలతో పాటు తన కుమారుడు అభిమన్యు యాదవ్ వివాహం జరిపించడం ద్వారా దేశానికి అరుదైన సందేశం ఇచ్చారు.
ఈ వేడుకలో సుమారు 25,000 మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ భారీ సమూహం మధ్య ఎక్కడా ఆడంబరపు హంగామా కనిపించలేదు. రాజకీయ ప్రభావం, శక్తి ప్రదర్శన, కోట్ల ఖర్చు.. ఇవేమీ లేవు. ఒక సాధారణ కుటుంబం చేసుకునేలా, మానవీయత, సమానత్వం, సంస్కృతి ముఖ్యమని చూపించేలా ఈ పెళ్లి జరిగింది. వేదమంత్రాల మధ్య యోగా గురు రాందేవ్ బాబా నేతృత్వంలో అభిమన్యు-ఇషిత వివాహం సాంప్రదాయబద్ధంగా పూర్తయ్యింది. ఈ ఘట్టం చూసిన జనాలు.. మోహన్ యాదవ్ సింప్లిసిటీకి సలాం చెబుతున్నారు. ఇలాంటివాళ్లే నిజమైన ప్రజానాయకులు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమాజంలో పెళ్లిళ్ల పేరిట జరిగే అనవసరపు ఖర్చులు, లగ్జరీ పోటీలు పెరుగుతున్న సమయంలో మోహన్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి స్ఫూర్తిగా మారింది.


