ఎర్రజెండా పోరాటాలకు వందనం!
పేదల కోసం ప్రాణాలర్పించిన కమ్యూనిస్టులు
దున్నేవాడిదే భూమి సిద్ధాంతానికి చారిత్రక నేపథ్యం
బ్రిటిష్‌ల కంటే బీజేపీ ఎంతో ప్రమాదకరం
“బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ”
ఖమ్మం జిల్లాలో మత పార్టీ బీజేపీకి చోటు లేదు
మోదీ, అమిత్ షా వచ్చి ప్రచారం చేసినా సర్పంచ్ సీటు కూడా గెలవలేరు
ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో కమ్యూనిస్టుల మద్దతు, శ్రమ ఉంది
బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం రండి
సీపీఐ శతాబ్ధి ఉత్సవాల సభలో కమ్యూనిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : పేదల హక్కుల కోసం ప్రాణాలు కోల్పోతామే కానీ ఎర్రజెండాను వదలమని ప్రకటించిన కమ్యూనిస్టు కామ్రేడ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందనాలు తెలిపారు.“దున్నేవాడిదే భూమి” అన్న నినాదాన్ని కమ్యూనిస్టులు ప్రజల్లోకి తీసుకెళ్లారని, ఆ సిద్ధాంతాన్ని అమల్లోకి తెచ్చింది ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు వంటి కాంగ్రెస్ నేతలేనని గుర్తు చేశారు. రైతులు పంటకు ధర నిర్ణయించలేని పరిస్థితుల్లో కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారని తెలిపారు. ఖమ్మం పట్టణంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ధి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రైతులు, రైతు కూలీలు, హరిజనులు, గిరిజనుల హక్కుల కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. నాలుగు వేల మంది అమర వీరుల త్యాగాల ఫలితంగానే హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి విముక్తి అయిందని సీఎం పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, శేషగిరి రావు వంటి ఎందరో నాయకులు నాడు ప్రజల కోసం పోరాడారని స్మరించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నాడు సాగిన పోరాటాలే నేటి ప్రజాస్వామ్యానికి పునాదులని వ్యాఖ్యానించారు.
“బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ”
“బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు… బ్రిటిష్ జనతా పార్టీ” అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ పథకం తెస్తే, బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని ఆరోపించారు. ఉపాధి హామీ రద్దుతో అగ్గువకో సగ్గువకో అదానీ–అంబానీలకు కూలీలు దొరికే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పేదల హక్కులు కొల్లగొట్టడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారని, రాజ్యాంగాన్ని చెరపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు ఎస్‌ఐఆర్ తెచ్చారని, రాజ్యాంగ సభ సమయంలోనూ గోల్వాల్కర్ వారసులు పేదలకు ఓటు హక్కు లేకుండా చేయాలని ప్రయత్నించారని గుర్తు చేశారు. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు, ఇల్లు, పింఛన్ అన్నీ పోతాయని ప్రజలను అప్రమత్తం చేశారు. “మూలవాసులు ఎక్కడి నుంచి ఆధారాలు తెస్తారు?” అని ప్రశ్నించారు.
బ్రిటిష్‌ల కంటే బీజేపీ ప్రమాదకరం!
నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, బ్రిటిష్ పాలనకన్నా బీజేపీ మరింత ప్రమాదకరంగా మారిందని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమవాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. సాధించిన స్వాతంత్య్రంలోనే నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక విధానాలు తీసుకొచ్చి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలు కొనసాగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఖమ్మంలో బీజేపీకి చోటు లేదు
కాంగ్రెస్, కమ్యూనిస్టులు తేడా లేకుండా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలని సీఎం పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ పేదల పక్షానే నిలబడి పోరాడతారని కొనియాడారు. “నేటి ఈ ప్రభుత్వంలో మీ శ్రమ ఉంది” అంటూ కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. “నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు” అని స్పష్టం చేశారు. “తులసీ వనంలో గంజాయి మొక్కకు చోటు లేనట్టే… ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు లేదు” అంటూ వ్యాఖ్యనించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి రాజకీయ స్థానం లేదని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి సర్పంచులు కూడా లేరని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం మొత్తం బీజేపీ, నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పారు. ఈ పోరాటంలో కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘మీరందరూ కలిసి రండి… *రాహుల్ గాంధీ*ని దేశ ప్రధానమంత్రిని చేద్దాం’’ అంటూ సభను ఉద్దేశించి సీఎం పిలుపునిచ్చారు. చివరగా కమ్యూనిస్టు శతజయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


