- ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం
- కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటాం
- పల్లెపల్లెనా కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం
- బీఆర్ఎస్ పాపాలనూ ప్రజల ముందుంచుతాం
- పొరపాటున ఆపార్టీలను గెలిపిస్తే ఊరు వల్లకాడే…
- పంచాయతీలకు పైసలిస్తోంది కేంద్రమే..
- పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా టికెట్లు ఇస్తాం..
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు… గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధం అన్నారు. స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని, కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. ఆసియా కప్, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే రేపు జరగబోయే కరీంనగర్ పల్లె లీగ్ (కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్ (ఎస్పీఎల్) స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. టిక్కెట్లు ఇవ్వడంతోపాటు గెలిపించుకుని కాషాయ కార్యకర్తల నుదుటిన విజయ తిలకం దిద్దుతామని తెలిపారు. ఈరోజు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నాం. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలవల్ల స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైనయ్. గత బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకపోవడమే కాక అభివ్రుద్ది పేరుతో నాటి సర్పంచులు చేసిన పనులకు కూడా బిల్లులివ్వకుండా వేధించింది. కేంద్రం నుండి వచ్చిన నిధులను సైతం దారి మళ్లించింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవంటూ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా ఈ పార్టీ చేతులెత్తేసింది. దేశ చరిత్రలో 22 నెలలుగా పంచాయతీలకు నయాపైసా విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే.. అని బండి అన్నారు. పంచాయతీలు అంతో ఇంతో అభివృద్ది జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వమే కారణం. ఏటా క్రమం తప్పకుండా పంచాయతీలకు ఠంచన్ గా నిధులను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం నుండి నిధులు ఆగిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించి ఆ నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నారే తప్ప స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామాలను, మండలాలను అభివృద్ధి చేసుకుందామనే ఆసక్తి కాంగ్రెస్ పాలకులకు లేనే లేదని సంజయ్ ఆరోపించారు.
అర్హులకే టికెట్లు ఇస్తాం..
స్థానిక ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లి ఎండగడతాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని పల్లెపల్లెకూ వివరిస్తాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన పాపాలను సైతం వివరించి ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాయ మాటలు నమ్మి గెలిపిస్తే ఈసారి ఊరు వల్లకాడు అవుతుందనే వాస్తవాన్ని ప్రజల ముందుంచుతాం. ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తాం. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా, గెలుపే గీటురాయిగా భావించి టిక్కెట్లు ఇస్తాం. పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న నాయకులు కొన్ని చోట్ల గెలిచే అవకాశం లేకపోయినా, రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దు. వారికి పార్టీలో, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తాం. అంతిమంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి అత్యధిక స్థానాలు సాధించి కాషాయ జెండా సత్తాను చాటాలని బండి సంజయ్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


