టీ–సేఫ్‌తో భద్రత… అవగాహనతో రక్షణ!
ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌పై షీటీమ్ హెచ్చరిక
కాకతీయ, వరంగల్ సిటీ : మహిళలు, బాలికలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ ఘటనలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని షీటీమ్ ఆర్ఎస్ఐ స్వాతి పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ రామ్‌నగర్‌లోని షైన్ హై స్కూల్‌లో సుమారు 400 మంది విద్యార్థి, విద్యార్థినులకు షీటీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ స్వాతి మాట్లాడుతూ… సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఫోటోలు, మొబైల్ నంబర్లు, చిరునామాలు షేర్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నేరాలకు దారి తీస్తుందన్నారు.
టీ–సేఫ్ యాప్ వినియోగం
ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ–సేఫ్ యాప్ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చని వివరించారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, అనుచిత ప్రవర్తన ఎదురైతే భయపడకుండా ధైర్యంగా షీటీమ్‌ను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1930, వరంగల్ షీటీమ్ ఇన్స్పెక్టర్ 8712685142, ఎస్ఐ 8712685270 నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, మహిళా కానిస్టేబుల్ పూర్ణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


