- సీఐ నాగార్జునరావుపై చర్య తీసుకోవాలి
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాకతీయ, మంథిని : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్థానిక పోలీసుల తీరుపై తీవ్రంగా
మండిపడ్డారు. ఖాకీ వేషధారణతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల స్థానంలో, నిజంగా సమాజానికి సేవ చేస్తున్న సఫాయి కర్మచారులే ఆదర్శమని పుట్ట మధూకర్ అన్నారు. రెండు రోజుల క్రితం కాటారం పోలీసులు బీఆర్‌ఎస్ మండల ఇంచార్జీ జోడు శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేయగా, ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మధూకర్ పరామర్శించారు. అనంతరం కాటారం మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సఫాయి కర్మచారి వెంకన్నను సత్కరించి, పాదాలను కడిగి గౌరవించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాకీ డ్రెస్ వేసుకొని నీచంగా వ్యవహరిస్తున్న పోలీసుల కంటే, ప్రజల ఆరోగ్యం కోసం మురుగు తొలిగించే కర్మచారులే ఎంతో గొప్పవారు అని అన్నారు. కాటారం సీఐ నాగార్జున రావు తాగిన మత్తులో జోడు శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేశాడని, ఇది మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ జోకర్ తమ్ముడి ఆదేశాలతో జరిగిందని ఆరోపించారు. సీఐ నాగార్జునరావుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం చదవని పోలీసులు రేపటి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.
నియోజకవర్గంలో దుద్దిళ్ల శ్రీధర్ స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, గతంలో జక్కు శ్రావన్, జవ్వాజి తిరుపతి, అశోక్ వంటి నేతలపై వివిధ కులాల మహిళలతో అక్రమ కేసులు పెట్టించారని గుర్తు చేశారు. తాజాగా గౌడ కులస్తుడి ద్వారా జోడు శ్రీనివాస్‌పై కేసు పెట్టించారని ఆరోపించారు.


