త్యాగమే ప్రేమకు ప్రతీక… గుడ్ ఫ్రైడే సందేశం
వేల మందితో ఖమ్మం పట్టణంలో భక్తి ప్రదర్శన
ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్
కాకతీయ, ఖమ్మం : త్యాగం, క్షమ, ప్రేమల సందేశాన్ని ప్రపంచానికి అందించిన యేసుక్రీస్తు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఖమ్మం పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాత బస్టాండ్ ప్రాంతం నుంచి జడ్పీ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా కరుణగిరి వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా కథోలిక్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బిషప్ సగిలి ప్రకాష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు దైవ కుమారుడైనా మనుషుల కోసం బాధలను అనుభవించి సిలువపై ప్రాణత్యాగం చేసి క్షమాభావాన్ని ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వెలుగులు నింపిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. గుడ్ ఫ్రైడే ఆచరణలో భాగంగా యేసుప్రభు శ్రమలు, సిలువ వేయబడిన ఘట్టాలను యువకులు వేషధారణతో ప్రదర్శించగా భక్తులను ఆకట్టుకున్నాయి. మేరీమాత వేషధారణ, భక్తి గేయాలు, ఉపన్యాసాలతో యాత్ర ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. నలభై రోజుల దీక్షలో ఉన్న భక్తులు ఈ ప్రదర్శనలో పాల్గొని కరుణగిరిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు ఎస్ ఐజాక్, జ్ఞానేశ్, జయరాజు, గోవా శౌరయ్య, టి ఆంటోనీ, జి సురేష్, ఏసు రాజు జోసెఫ్, రాజు, సిస్టర్లు, బ్రదర్లు, సంఘస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



