గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి
పారదర్శక పాలనతో ప్రజల నమ్మకం నిలబెట్టాలి
గ్రామాలకు మౌలిక వసతుల్లో పూర్తి సహకారం
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
కొత్త సర్పంచ్‌లకు ఎమ్మెల్యే గండ్ర సూచనలు
కాకతీయ, గణపురం : గ్రామ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. సోమవారం గణపురం మండలంలోని బుద్దారం, గణపురం, చెల్పూర్ గ్రామాల్లో ఎన్నికైన సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కూడా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా పాలన సాగించాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు ప్రజల విశ్వాసమే అసలైన బలమని, అదే అభివృద్ధికి పునాదిగా మారుతుందని అన్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
గ్రామాల అభివృద్ధికి అవసరమైన తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల కల్పనలో ప్రజా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందేలా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నూతన పాలకవర్గాలకు సూచించారు. పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనతోనే ప్రజాప్రతినిధులకు శాశ్వత గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో ఎలాంటి అవినీతికి తావులేకుండా, అందరినీ కలుపుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఐక్యత, సామాజిక సమతుల్యతను కాపాడటం పాలకవర్గాల ప్రధాన బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా నూతన సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువతకు ప్రభుత్వ పథకాల ద్వారా మేలు జరిగేలా పనిచేయాలని అన్నారు. కార్యక్రమం అనంతరం గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును శాలువాలతో ఘనంగా సన్మానించారు.


