గణప సముద్రం చెరువు పై వదంతులు అబద్దం.. అధికారుల స్పష్టీకరణ..
కాకతీయ, వరంగల్ బ్యూరో :
భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణప సముద్రం సరస్సు గండి పడుతుందన్న వార్తలు పూర్తిగా అసత్యమని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఉదయం ఐబీ అధికారులు చెరువును స్వయంగా పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని నివేదించారని, చెరువు నీటి మట్టం ప్రస్తుతం 27 అడుగులు దాటిందని ఇరిగేషన్ డివిజన్ నంబర్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బసవ ప్రసాద్ తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని చెరువులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో డీఈఈలు, ఏఈఈలు, లష్కర్లు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, తగు జాగ్రత్తలు అన్ని విధాలా తీసుకుంటున్నామని బసవ ప్రసాద్ వివరించారు. ప్రజలు అధికారుల నుంచి వచ్చే అధికారిక సమాచారం తప్ప వేరే వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.


