కాకతీయ, వరంగల్ : నగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర ఆర్.టి.ఐ కమిషనర్లు పి.వి శ్రీనివాసరావు, బి.అయోధ్య రెడ్డిలు సందర్శించారు. కమిషనర్లకు ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఆలయ స్నపన మండపంలో అర్చకులు, వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామల సునీత, ఆర్.టి.ఐ సిబ్బంది, దేవాలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


