రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం
డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిన డ్రైవర్
ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
కాకతీయ, గీసుగొండ : ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన గీసుగొండ మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గూడ సంతోష్ కుమార్ (46) ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్ కుమార్ తన ద్విచక్ర వాహనాన్ని రిపేర్ చేయించుకుని వరంగల్ నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో 16వ డివిజన్ ధర్మారం సమీపంలో అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో సంతోష్ వాహనం నుంచి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కాగా, అధిక రక్తస్రావం జరగడంతో పరిస్థితి విషమించింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే సంతోష్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్టీసీ డ్రైవర్ సంతోష్ కుమార్ మృతితో గంగదేవిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


