గంగాధర డిగ్రీ కళాశాలకి రూ.5 కోట్లు
ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం కృషి ఫలితం
కాకతీయ, కరీంనగర్ : గంగాధర మండల ప్రజల ఇరువై ఏళ్ల ఆశాజ్యోతి నిజమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి, దానికి స్వంత భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేయించడంలో ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం కీలకపాత్ర పోషించారు. మాటలు చెప్పడమే పని అయిన నాయకులు గతంలో ఎన్నో హామీలు ఇచ్చినా, అవి అమల్లోకి రానప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం మరోసారి రుజువు చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.ఉన్నత విద్యే గ్రామీణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని నమ్మిన సత్యం, గంగాధరతో పాటు పరిసర మండలాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులు డిగ్రీ విద్య కోసం దూరం వెళ్లాల్సిన పరిస్థితిని ప్రధాన సమస్యగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, చొప్పదండి నియోజకవర్గానికి కళాశాలను మంజూరు చేయించారు.అంతటితో ఆగకుండా, కళాశాలకు స్వంత భవనం అవసరమని భావించిన ఎమ్మెల్యే సత్యం, మళ్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి భవన నిర్మాణానికి రూ.5 కోట్లు ఆమోదింపజేశారు. దీంతో గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భవన నిర్మాణ నిధుల మంజూరు చొప్పదండి నియోజకవర్గానికి పెద్ద వరమని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విద్యార్థుల కల నిజం చేయడంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చూపిన పట్టుదలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


