రూ.4 లక్షల నగదు పట్టివేత
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.4 లక్షల నగదు పట్టుబడింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన పురుమడ్ల వెంకట్ రెడ్డి గురువారం కారులో ప్రయాణిస్తుండగా, సిరిసిల్ల పట్టణంలోని మానేరు బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయన వద్ద ఎలాంటి సరైన ధ్రువపత్రాలు లేని రూ.4 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో నగదుకు సంబంధించి తగిన ఆధారాలు చూపలేకపోవడంతో, ఎస్‌ఎస్‌టీ బృంద ఇంచార్జి శ్రీకాంత్ పంచుల సమక్షంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నగదుకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతున్నట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.


