ఏటా సంక్రాంతికి రూ.30 వేలు!
మహిళా ఓటర్లకు ఖాతాల్లో జమచేస్తాం
తేజస్వి యాదవ్ ఎన్నికల హామీ
‘మాయ్-బహిన్ మాన్ యోజనా’ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి
హాట్ టాపిక్‌గా మారిన యువ నేత ప్రకటన
కాకతీయ, నేషనల్ డెస్క్ : బీహార్‌లో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ హీటెక్కుతోంది. మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజునే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే ప్రకటన వెలువడింది. మహిళా ఓటర్లను ఆకర్షించేలా ఆర్జేడీ నేత, కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన హామీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తేజస్వి యాదవ్ తన ఎన్నికల హామీలో భాగంగా, ప్రతి మహిళా ఓటరుకి సంవత్సరానికి రూ.30,000 నగదు సాయం అందిస్తామని ప్రకటించారు. “మేము అధికారంలోకి వస్తే ‘మాయ్-బహిన్ మాన్ యోజనా’ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. ప్రతి మకర సంక్రాంతి రోజున మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.30 వేలు జమ చేస్తాం,” అని తేజస్వి స్పష్టం చేశారు. ఈ హామీ ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీహార్ ప్రభుత్వం ఇటీవల నవరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 నగదు జమ చేసింది. ఈ చర్య కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ చేసిన హామీ దానికి మించి ఉండటంతో, బీహార్ ఎన్నికల హీట్ మరింత పెరిగింది.
మహిళా ఓటర్లపై దృష్టి.. రాజకీయ లెక్కలు మారుతాయా?
బీహార్‌లో మహిళా ఓటర్ల శాతం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తేజస్వి హామీ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహిళా ఓటర్ల మనసు గెలవగలిగితే, బీహార్ ఎన్నికల ఫలితాలు తేజస్వి వైపు తిప్పుకోవడం ఖాయమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక రూలింగ్ ఎన్డీయే నేతలు మాత్రం ఈ హామీని అవాస్తవం, ఆర్థికంగా అమలు చేయలేనిది అని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఖజానా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, ఏటా ఈ స్థాయి నగదు పంపిణీ సాధ్యమా అన్నదానిపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొత్తానికి ఓటింగ్ దశలు సమీపిస్తున్న వేళ, మహిళా ఓటర్ల మద్దతు ఎటు మొగ్గుతుందో అన్నది ఆసక్తిగా మారింది. అయితే తేజస్వి ఆర్థిక హామీ బీహార్ రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తుందా? అనేది నవంబర్ 20న మొదలయ్యే మొదటి దశ పోలింగ్ తరువాతే తేలనుంది.


