కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే వనదేవతల సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈసారి జాతరను గతం కంటే మరింత ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సచివాలయంలో బుధవారం మేడారం మాస్టర్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు కుంభమేళాలను నిర్వహించిన సంస్థకే మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలు అప్పగించినట్టు అధికారులు తెలిపారు. మేడారం మహా జాతరలోపు అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.
పూజారుల సూచనల మేరకు ఆలయ ప్రాంగణ డిజైన్లలో మార్పులు చేయాలని, అమ్మవారి గద్దెల ఎత్తు పెంచి, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా చూడాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. జాతర సందర్భంగా వలంటీర్లను నియమించి సేవలు అందించాలని, వాహనాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం ఏఐ కెమెరాలు, బ్యాటరీ వాహనాలు, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తినుబండారాలు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను ఉపయోగించాలని నిర్ణయించారు.
జాతర అభివృద్ధికి మొత్తం రూ. 236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
అందులో.. గద్దెల అభివృద్ధికి రూ. 58.2 కోట్లు, కళాకృతి పనులకు రూ. 6.8 కోట్లు, జంపన్న వాగు అభివృద్ధికి రూ. 39 కోట్లు, భక్తుల వసతి కోసం రూ. 50 కోట్లు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ. 52.5 కోట్లు, మిగిలినవి ఇతర ఖర్చుల కోసం కేటాయించారు. జాతర విజయవంతం కావడానికి రహదారుల విస్తరణ కీలకమని మంత్రులు పేర్కొన్నారు.
ఇందుకోసం మేడారం-ఊరట్టం, మేడారం -కన్నెపల్లి మార్గాలతో పాటు మరో నాలుగు మార్గాలను విస్తరించాలని అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పనులను రెండు ఫేజ్‌లలో పూర్తి చేస్తామని వివరించారు. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మేడారం జాతరకు రూ. 150 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. పూజారుల భాగస్వామ్యంతో జాతర అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.


