పైరసీతో రూ.20 కోట్లు..
ఇమ్మడి రవి హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలు
నిందితుడి వద్ద 50 లక్షల మంది డేటా
బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ ..
పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం
వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్ ..
సినీ రంగ ప్రముఖుల ధన్యవాదాలు
తమ సేవలను శాశ్వతంగా నిలిపివేసిన ఐబొమ్మ, బప్పం టీవీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పైరసీతో సినీ రంగానికి తీవ్ర నష్టం వాటిళ్లిందని సీపీ సజ్జనార్ తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతడిపై ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం) యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులను నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశామని సజ్జనార్ చెప్పారు. ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడన్నారు. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేస్తున్నాడని సీపీ తెలిపారు. దీంతో బెట్టింగ్ భూతానికి చాలా మంది బలయ్యారన్నారు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరో కొత్త సైట్‌ను నిందితుడు తయారు చేశాడని వివరించారు. ఇలా 65 మిర్రర్ వెబ్‌సైట్లు నిర్వహించాడని ఆయన వెల్లడించారు. అంతకు ముందు సజ్జనార్‌ను సినీ రంగ ప్రముఖులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
రూ.3 కోట్లు సీజ్
21 వేల సినిమాలు ఇమ్మడి రవి హార్డ్ డిస్క్‌లో ఉన్నాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ సినిమా వరకు అందులో ఉన్నాయన్నారు. రూ.20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడని ఆయన వివరించారు. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశామని సీపీ తెలిపారు. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉందని సీపీ వెల్లడించారు. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరమన్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందని సజ్జనార్ చెప్పారు. పోలీసులు వెంటపడ్డాక దేశ పౌరసత్వం వదులుకున్నాడు : ఇమ్మడి రవి స్వస్థలం ఏపీలోని విశాఖపట్నమని, బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడని సజ్జనార్ తెలిపారు. అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులను తీసుకున్నాడని ఆయన వివరించారు. నిందితుడు మొదటి నుంచి నేర ప్రవృత్తితో ఉన్నాడన్నారు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతడి వెంట పడ్డారని సజ్జనార్ వెల్లడించారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడని వివరించారు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడన్నారు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21 వేల సినిమాలు పైరసీ చేసినట్లుగా సజ్జనార్ తెలిపారు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడన్నారు. 110 డొమైన్స్ కొనుక్కున్నాడని చెప్పారు. ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేస్తూ పైరసీ సినిమాలు విడుదల చేశాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ రాకెట్‌లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.
అలాంటి మీమ్స్ చేస్తే కఠిన చర్యలు
ఎవరో ఇచ్చిన సమాచారంతో నిందితుడు ఇమ్మడి రవిని పట్టుకున్నామనేది అబద్ధమని తాము సొంతగానే పట్టుకున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు. నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారని వివరించారు. సహకరించిన సినీప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తమ దగ్గర 5 కోట్ల మంది ప్రజల డేటా ఉందని బెదిరించిన వారు కూడా ఉన్నారన్నారు. దమ్ముంటే పట్టుకోండని సవాలు చేసిన వారిని కూడా పట్టుకున్నామన్నారు. నిందితుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత చాలా మంది మీమ్స్ వేశారని, ఇకపై ఇలాంటి వాటిని చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
ప్రకటన విడదల చేసిన ఐబొమ్మ
ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టైన నేపథ్యంలో ఐ బొమ్మ ప్రకటన విడుదల చేసింది. తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని వెబ్‌సైట్లో పేర్కొంది. మీకు ఇటీవల తమ గురించి తెలిసి ఉండొచ్చని, లేదంటే మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండొచ్చని తెలిపారు. ఏదేమైనా మీ దేశంలో తమ సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నామని అన్నారు. అందుకు క్షమాపణలు కోరుతున్నామని బొమ్మ ప్రకటనలో వెల్లడించింది.



