రూ.12 వేల అప్పే ప్రాణం తీసింది
పథకం ప్రకారమే అంజయ్య హత్య
తండ్రి–కొడుకు అరెస్ట్ : సీఐ కరుణాకర్ వెల్లడి
కాకతీయ, జగిత్యాల : రూ.12 వేల అప్పు వివాదం జగిత్యాల పట్టణంలో దారుణ హత్యకు దారితీసింది. జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్యను పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసిన ఘటనలో తండ్రి–కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను పట్టణ సీఐ కరుణాకర్ శుక్రవారం వెల్లడించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. జగిత్యాల పట్టణానికి చెందిన బాసోజి శ్రీనివాస్, అతని కుమారుడు వేణు చారీలు డిసెంబర్ 31న అంజయ్యపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. మృతుడు అంజయ్యకు నిందితుడు శ్రీనివాస్ గతంలో చిట్టీ డబ్బుల రూపంలో సుమారు రూ.12 వేల వరకు ఇచ్చాడని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అంజయ్య కోరడంతో వారి మధ్య తీవ్ర వివాదం నెలకొన్నట్లు తెలిపారు.
ముందస్తు పథకంతో హత్య
డబ్బుల విషయంలో గొడవలు పెరగడంతో అంజయ్యను పిలిపించుకుని, ముందే పథకం వేసుకుని తండ్రి–కొడుకులు ఇద్దరూ కలిసి తీవ్రంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారని సీఐ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని సీఐ కరుణాకర్ స్పష్టం చేశారు. అప్పు వివాదాల నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.


